సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కృష్ణ మనవడు, హీరో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి హ్యాండిల్ చేయనున్నారని సమాచారం. RX 100 లాంటి బ్లాక్‌బస్టర్‌తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి, ఇటీవల థ్రిల్లర్ “మంగళవరం”తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం “మంగళవారం 2” ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, మరో హై-ప్రొఫైల్ లాంచింగ్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారానే జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.
ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్ పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను జయకృష్ణ బాబాయి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంచి లాంచ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.






