సంక్రాంతి పండుగ (Sankranti) అనగానే మనకు గుర్తొచ్చేది ఇంటిముందు రంగవళ్లులు, ఇంట్లో ప్రత్యేకమైన పిండి వంటలు, కుటుంబంతో కలిసి గడిపే ఆనంద క్షణాలు, డాబాపై ఎగురవేసే గాలిపటాలే గుర్తుకువస్తాయి. ఇవే కాకుండా ఇంకో స్పెషాలిటీ ఉంది ఈ పండుగకు. అదే మకరజ్యోతి. ప్రతి ఏటా జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం పూట ఆకాశంలో కనిపించే దివ్యమైన కాంతిపుంజమే మకరజ్యోతి. కేరళలోని శబరిమల (Sabarimala)కు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై ఈ కాంతి కనిపిస్తుంది.
నేడే మకరజ్యోతి దర్శనం
ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. అయ్యప్ప స్వామే భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతి (Makara Jyothi)గా దర్శనమిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే మకరజ్యోతిని చూసేందుకు వేలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తారు. ఇక మకరజ్యోతి దర్శనం తర్వాత మాలధారులు దీక్ష విరమిస్తారు. మకరజ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధానార్చకులు అయ్యప్ప స్వామికి అలంకరించి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నంబళ మేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది.
మకరజ్యోతి ఓ దివ్యనక్షత్రం
మకరజ్యోతి మానవులు వెలిగించే దీపం కాదు అని.. అదొక దివ్య నక్షత్రం అని శబరిమల ఆలయం ప్రధానార్చకుడు తెలిపారు. మకర విళక్కు అంటే కొండపై నుంచి మూడుసార్లు కనిపించే దీపమని అర్థమని చెప్పారు. పొన్నంబళమేడు పర్వతంపైన చేసే ఒక దీపారాధన. మకర సంక్రాంతి (Sankranti Makara Jyothi 2025) రోజున సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణులు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఈ మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చే అయ్యప్ప స్వరూపం వీక్షిస్తే జన్మ రాహిత్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
స్వామియే శరణమయ్యప్ప!






