
కీర్తి సురేష్ (Keerthy Suresh).. మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఆ చిత్రం తర్వాత సూపర్ స్టార్ అయిపోతుందని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో సరైన హిట్లు పడలేదు. ఇక మహేష్ బాబుతో చేసిన ‘సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)’ చిత్రంతో కీర్తి కాస్త గ్లామర్ డోస్ పెంచి కమర్షియల్ సినిమాలకూ తాను సై అనే సందేశం ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీకీ అలాంటి ఆఫర్లే వస్తున్నాయి. ఇక ఇటీవలే బేబీ జాన్ (Babu John) తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయినా.. ఈ భామకు హిందీ పరిశ్రమలో అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.
రణ్ బీర్ కపూర్ తో కీర్తి లవ్ స్టోరీ
కీర్తి ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ ప్రయాణం సాగిస్తోంది. ఈ మూడు ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తోంది. తాజాగా ఈ భామ హిందీలో ఓ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరో ఎవరో కాదు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor). ప్రస్తుతం రణ్ బీర్ రామాయణం, లవ్ అండ్ వార్, యానిమాల్ పార్క్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయ్యాకే కీర్తి చిత్రం ఉంటుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రౌడీ జనార్ధనలో కీర్తి
ఇక టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి జతకట్టనుందట. రౌడీ జనార్ధన (Rowdy Janardhana) అనే సినిమాలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ చిత్రానికి రవి కిరణ్ కోల దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కనుక కీర్తి ఓకే అయితే ఈ బ్యూటీకి కమర్షియల్ హిట్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అరడజను ప్రాజెక్టుల్లో కీర్తి
ఇక యంగ్ హీరో నితిన్, బలగం ఫేం వేణు యెల్దండి కాంబోలో ఎల్లమ్మ (Yellamma) అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనూ కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. దాదాపుగా కన్ఫామ్ అయినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా రివాల్వర్ రీటా, ఉప్పు కప్పురంబు వంటి సినిమాలు అక్క అనే ఓ వెబ్ సిరీస్ లో కీర్తి నటిస్తోంది. ఈ ఏడాది కీర్తి దాదాపు అరడజను ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.