Mana Enadu: మన్యం వీరుడు (Manyam Veerudu) అల్లూరి సీతారామరాజు జీవితంపై, పోరాటంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి మొన్నటి రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం వరకు అల్లూరి గురించి ఎంతో మంది దర్శకులు ఎన్నో విషయాలు చెప్పారు. తాజాగా మరో దర్శకుడు ఈ మన్యం వీరుడిలోని మరో కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
నరేశ్ డెక్కల దర్శకత్వంలో ఆర్‌వీవీ మూవీస్ పతాకంపై ఆర్.పార్వతీ దేవి సమర్పణలో వస్తున్న సినిమా “మన్యం ధీరుడు” (Manyam Dheerudu). ఆర్‌వివి సత్యనారాణ స్వీయ నిర్మాణంలో నటించిన ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. సెప్టెంబరు 20వ తేదీన ఈ సినిమా (Manyam Dheerudu Release Date) విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు పవన్ కుమార్ సంగీతం అందించగా, వినీత్ ఆర్య, ఫరూక్ సినిమాటోగ్రఫీ చేశారు.
అల్లూరి సీతారామరాజు (Alluri Sitharamaraju) నిజరూప చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు తాను చాలా కష్టపడినట్లు సత్యనారాయణ తెలిపారు. అల్లూరి పాత్ర కోసం తాను కత్తియుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు చెప్పారు, విలువిద్యలో శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు. మన్యం ధీరుడు సినిమా యదార్థ సంఘటనలను తలపించాలని చిత్రబృందం చాలా కష్టపడిందని వివరించారు. బానిస సంకెళ్లు తెంచుకుని అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ దొరల పాలనకు చరమగీతం పాడే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పారు.