
నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీపికబురు అందించారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (AP Mega DSC) ఉంటుందని ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. పాఠశాలల ప్రారంభం నాటికి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
కలెక్టర్లు దర్పం ప్రదర్శించొద్దు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందన్న ముఖ్యమంత్రి.. కొందరు అభివృద్ధి చేస్తే.. మరికొందరు నాశనం చేస్తారని వ్యాఖ్యానించారు.
ప్రజలకు హామీ ఇచ్చాం
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని కలెక్టర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానం అని తెలిపారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని వ్యాఖ్యానించారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.