ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిపై ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ఫోకస్ చేశారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అన్ని బాధ్యతలు చూస్తున్న ఆయన పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ భారీ మెజారిటీ సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ మకాం వేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిపై ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ఫోకస్ చేశారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అన్ని బాధ్యతలు చూస్తున్న ఆయన పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ భారీ మెజారిటీ సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ మకాం వేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే రెండు మండలాలకు ఒక సభ చొప్పున మొత్తం నాలుగు సభలు నిర్వహించారు కేటీఆర్. మాచారెడ్డి, రామారెడ్డి మండలాలతో పాటు కామారెడ్డి పట్టణంలోని అంగడిబజార్‌లో కామారెడ్డి మండలానికి సంబంధించి సభలు నిర్వహించారు. భిక్కనూరు, రాజంపేట మండలాలకు సంబంధించి భిక్కనూరులో, దోమకొండ, బీబీపేట మండలాలకు సంబంధించి దోమకొండలో నిర్వహించిన సభలలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కామారెడ్డి నుంచి పోటీచేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రకటించడంతో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కొడంగల్‌లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతవా..?’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. కొడంగల్‌లో నరేందర్ రెడ్డిపై ఓడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసి గెలుస్తారా? అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
నియోజకవర్గంలోని పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాలను ఓ వైపు పరిష్కరిస్తూనే మరోవైపు ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్న దానిపై ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి వివరించారు కేటీఆర్. బూత్‌ల వారీగా వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జీని నియమించుకుని ఎన్నికల కదనరంగంలోకి దిగాలని ఆదేశించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్‌లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. మండలాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుని బూత్ కమిటీల జాబితాలను రూపొందించారు కేటీఆర్.
కామారెడ్డిలో అనుసరించాల్సిన వ్యూహాలపై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. నేతల మధ్య నెలకొన్న విభేదాలు, ఆరోపణలపై పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ముఖ్య నేతలకు ఫోన్ చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కేటీఆర్. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ రద్దు అంశంపై ఎన్నికల బరిలో దిగుతామని బాధిత రైతులు ప్రకటించడంతో కేటీఆర్ వారిని హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. వివిధ వర్గాల నేతలతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు కేటీఆర్.