
తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ (MLC Elections 2025) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తెలంగాణలో (Telangana MLC Polls 2025) మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఓటేయనున్న చంద్రబాబు
ఇక ఏపీలో (AP MLC Elections 2025) ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 70 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్ ఓటు వేయనున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మార్చి 3న ఫలితాలు
ఓటరు గుర్తింపు కార్డు సహా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును మార్చి 3వ తేదీన చేపడతారు.