
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మారుతీ రావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ (Pranay Murder Case) ను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో తాజాగా నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది.
ఆరేళ్ల తర్వాత తీర్పు
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం.. దర్యాప్తు ముమ్మరం చేసి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంది. 2019లో ఛార్జిషీటు దాఖలు చేయగా.. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగింది. ఇక ఇటీవలే వాదనలు ముగియడంతో తాజాగా సోమవారం (మార్చి 10వ తేదీ) నల్గొండ కోర్టు (Nalgonda Court) తుది తీర్పు వెల్లడించింది.
ఏ1 ఆత్మహత్య
ప్రణయ్ హత్య కేసులో ఏ1 మారుతీ రావు (Maruthi Rao) (అమృత తండ్రి) 2020లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో ఏ2 సుభాష్ కుమార్ శర్మ, ఏ3 అస్గర్ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలకు తాజాగా శిక్ష ఖరారయింది. ఏ2కు ఉరిశిక్ష.. మిగతావారికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసులో సుభాష్ శర్మ, అస్గర్ అలీ వేర్వేరు జైల్లలో ఉండగా.. మిగిలిన వారంతా బెయిల్ పై బయటకు వచ్చారు.