Mana Enadu : పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు (Jammu Kashmir Assembly Elections 2024) జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని వెల్లడించకుండానే ప్రచారం చేసి గెలిచిన కూటమి.. ఫలితాల తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ కూటమి కూటమి సిద్ధమైంది.
నేడే జమ్మూకశ్మీర్ సీఎం ప్రమాణ స్వీకారం
ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మంగళవారం రోజున లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సెన్హాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరారు. బుధవారం (అక్టోబర్ 16వ తేదీ 2024) రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్కు తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎల్జీ.. ప్రమాణ స్వీకారానికి అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒమర్ అబ్దుల్లా చేత ఎల్జీ మరోసారి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (CM Omar Abdullah Oath Ceremony) చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
రెండు చోట్లా మర్ అబ్దుల్లా విజయకేతనం
మాజీ ముఖ్యమంత్రి అయిన ఒమర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. బద్గాం నియోజకవర్గం నుంచి పీడీపీ అభ్యర్థి అగా సయద్ ముంతజీర్ మెహ్దీపై 18వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో.. మరోవైపు అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట అయిన గందర్బల్ (Omar Abdullah Victory) స్థానం నుంచి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ
ఇక జమ్మూకశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. ఇక్కడ హంగ్ సర్కారే ఏర్పాటవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి (Congress NC Alliance) ఆధిక్యంలో దూసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. నేషనల్ కాన్ఫిరెన్స్ ఏకంగా 42 సీట్లు.. ఎన్సీ మిత్రపక్షమైన కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఈ కూటమి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 46ను సంపాదించగలిగాయి. బీజేపీ మొత్తం 29 స్థానాల్లో.. పీడీపీ 3, జేపీసీ 1, సీపీఎం 1, ఆప్ 1, ఇతరులు 7 సీట్లలో విజయం సాధించాయి.