Mana Enadu : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi)పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తాజాగా కీలక ప్రకటన చేసింది. అన్మోల్‌పై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.
అన్మోల్ బిష్ణోయ్‌పై రివార్డు
2022లో నమోదైన రెండు కేసుల్లో అతడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల జరిగిన ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్య (Baba Siddique’s murder)కు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతడి ఆచూకీపై ఆరా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే అన్మోల్ ఆచూకీ గురించి చెప్పిన వారికి, అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్‌ఐఏ ఓ ప్రకటన జారీ చేసింది.
సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు
మరోవైపు గతంలో కృష్ణజింక(black deer)ను వేటాడిన కేసులో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ఒకరోజు సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్‌నకు చెక్కు బుక్ ఇచ్చి.. ఎంత కావాలో రాసుకోవచ్చన్నారని తాజాగా లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు రమేశ్ బిష్ణోయ్(Ramesh Bishnoi) సంచలన ఆరోపణలు చేశాడు. అయితే, సల్మాన్ ఆఫర్‌ను తాము తిరస్కరించినట్లు చెప్పాడు. ఆ ఘటనకు పరిహారం ఆఫర్ చేయడాన్ని బిష్ణోయ్ వర్గం ఖండించిందని తెలిపాడు. ఆర్థిక ప్రయోజనం కోసమే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తుందంటూ సల్మాన్ ఖాన్(Salman Khan) తండ్రి సలీం ఖాన్ చేసిన వ్యాఖ్యల్ని రమేశ్ బిష్ణోయ్ కొట్టిపారేశాడు.
మా సపోర్టు లారెన్స్‌కే
“ఒకవేళ మేము డబ్బు వైపే ఉంటే.. ఆ ఆఫర్‌ను అంగీకరించి ఉండేవాళ్లం. సల్మాన్ కృష్ణజింకను వేటాడిన ఘటన సమయంలో మా రక్తం మరిగిపోయింది. మాలో ఎంత ఆవేశం ఉన్నా.. న్యాయ వ్యవస్థ ద్వారానే వెళ్లాం. కానీ, మా ఎమోషన్స్‌ను చిన్నచూపు చూసే ప్రయత్నాలను అవమానంగా భావించాం. లారెన్స్ బిష్ణోయ్‌కు మద్దతుగా మా వర్గం ఐక్యంగా ఉంది.” రమేశ్ బిష్ణోయ్ చెప్పుకొచ్చాడు.