పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ‘వార్-2’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బీ టౌన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి వస్తున్న ఈ మల్టీస్టారర్ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా గురించి రైటర్ అబ్బాస్ ఓ సూపర్ అప్డేట్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయిందని ఆయన తెలిపారు.
వార్-2 రిలీజ్ డేట్
ఎన్టీఆర్ నటించిన తొలి హిందీ మూవీ వార్-2 (WAR-2) ఈ ఏడాది ఆగస్టులో విడుదలకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని అబ్బాస్ తెలిపారు. ఆరోజు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లను థియేటర్లో కలుద్దామని అన్నారు. వార్-2లో డైలాగ్స్ అన్నీ అబ్బాస్ (Abbas) రాశారు. ఈ డైలాగ్స్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
నెగిటివ్ రోల్ లో ఎన్టీఆర్
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘వార్’. ఈ స్పై థ్రిల్లర్ సూపర్ సక్సెస్ సాధించడంతో అయాన్ ముఖర్జీ దీనికి సీక్వెల్ గా ‘వార్-2’ (War 2) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్గా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక వార్-2 సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్లో భాగం కానున్నారు.






