
పెరుగుతున్న టెక్నాలజీ, సాంకేతికతలో వస్తున్న పెను మార్పులతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. దుష్ప్రయోజనాలు అంతకంటే ఎక్కువగానే ఉంటున్నాయి. సైబర్ నేరాలు, టెక్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడి సామాన్య ప్రజలే కాదు ప్రముఖులు కూడా మోసపోతున్నారు. కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లు ప్రముఖులను టార్గెట్ చేసి వారిని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బారిన పడ్డారు ఎమ్మెల్యే వేముల వీరేశం.
ఏం జరిగిందంటే..?
తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) మొబైల్ కు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. తెలిసిన వారే అయి ఉంటారని ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. అంతే లిఫ్ట్ చేయగానే ఎదురుగా నగ్నంగా ఓ అమ్మాయి. వెంటనే ఆయన ఫోన్ కట్ చేశారు. కానీ అంతలోనే సైబర్ కేటుగాళ్లు ఆ న్యూడ్ కాల్ ను లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యే వీడియో రికార్డు చేశారు. ఆ వీడియో వైరల్ చేస్తామని, చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేశారు.
న్యూడ్ కాల్ రికార్డింగ్
అయితే ఇలాంటి సైబర్ మోసాలు నిత్యకృత్యం అయ్యాయని అవగాహన ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం ఆ కేటుగాళ్ల బెదిరింపులు పట్టించుకోలేదు. అయితే తెగించిన ఆ నేరగాళ్లు ఈ న్యూడ్ వీడియో రికార్డింగ్ ను ఎమ్మెల్యే కాంటాక్టు లిస్టులో ఉన్న వారందరికి పంపించారు. దీంతో వారంతా ఆయనకు కాల్ చేసి ఇదేంటని ప్రశ్నించడంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే చివరకు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఆ కేటుగాళ్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.