నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో (SLBC Tunnel Collapse) ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయిన 8 మంది కోసం గత 16 రోజులుగా రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శనివారం రోజున ఒకరి మృతదేహం బయటపడినట్లు అధికారులు తెలిపారు. చేతికి ఉన్న పచ్చబొట్టు, చెవికి ఉన్న రింగ్, దుస్తులపై ఉన్న రాబిన్స్ అనే పేరు ఆధారంగా మృతదేహం గురుప్రీత్‌సింగ్‌గా ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు
మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా (SLBC Tunnel Ex Gratia) చెక్‌ను అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ రెవెన్యూ అధికారుల ద్వారా అందజేశారు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్సులో మృతదేహాన్ని స్వస్థలం పంజాబ్‌కు తరలించారు. 16 రోజుల తర్వాత ఒకరి మృతదేహం (SLBC Tunnel Dead Body) బయటపడటంతో మిగిలిన వారూ అలాగే నిర్జీవంగా దొరుకుతారని వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మిగిలిన వారి కోసం సహాయక బృందాలు మరింత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టనున్నాయి.
అక్కడే మిగతా వాళ్లుండొచ్చు
అయితే గురుప్రీత్ మృతదేహం లభించిన స్థానంలోనే మిగిలిన వారూ ఉంటారని రెస్క్యూ బృందాలు అంచనా వేశాయి. ఈ క్రమంలోనే డి-1, డి-2 ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో మరో ముగ్గురి ఆచూకీ లభించొచ్చని సహాయక బృందాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన టీబీఎం ముందు భాగంలో తవ్వకాలు జరిపితే సొరంగం మళ్లీ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉండటం వల్ల రెస్క్యూ బృందాలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇక అందులో చిక్కుకున్న వారి జాడ తెలుసుకునేందుకు కేరళ క్యాడవర్ డాగ్స్ సాయం తీసుకుంటున్నారు.






