ASR
తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు, పార్టీల ఎత్తులు మొదలయ్యాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలన్న కసిలో ఉన్న గులాభీ దళపతి.. ఏడాది ముందు నుంచే ఒక్కో నియోజకవర్గాన్ని సమీక్షిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కొందరు సిట్టింగులను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించడంతో పాటు పక్క పార్టీలకు కలిసొస్తారనుకునే తిరుగుబాటు నేతలకు తాయిలాలు, పలు పదవులనూ ఆఫర్ చేస్తూ బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు తనను ఎదురిస్తే ఎటూ కదలనీయకుండా చేస్తానని.. మాటల్లో నేరుగా చెప్పకనే క్షేత్రస్థాయిలో యాక్షన్‌తో ఆ నేతలకు ఎదురుదెబ్బ తగిలేలా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల నియోజకవర్గాలకు, అధికార పార్టీ నేతల నియోజకవర్గాలకు నిధుల విడుదల, పథకాల అమలు విషయంలో మొదటి నుంచీ తేడా కనిపిస్తున్నా.. ఎన్నికలకు ముందు అది కాస్త పెరుగుతుంది. అదే ఇప్పుడు మల్కాజ్‌గిరిలోనూ జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఇటీవలె తన కుమారుడికి టిక్కెట్టు దక్కలేదన్న ఆవేశంలో నోరు జారి పార్టీకి, సిట్టింగు సీటును చేజార్చుకున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే హన్మంతరావుకు ఇప్పుడు నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగులుతోంది. ఎన్నికలకు ముంగిట భారాస సిట్టింగులు ఉన్న అన్ని నియోజకవర్గాలకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ, దళిత బంధు రెండో విడత, సీఎం రిలీఫ్ ఫండ్, ఇతర ఎమ్మెల్యే ఫండ్స్ ఈ నెలలో విడుదల చేయాలని ప్రత్యేక ఆదేశాలిచ్చారని తెలిసింది. అయితే మల్కాజ్‌గిరికి వీటిని ఆపాలని.. స్థానికంగా ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని మెదక్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు ఈ బాధ్యతలు అప్పజెప్పారట. ఆ నేత నుంచి ఇప్పటికే నియోజవర్గంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు అనఫీషియల్ ఆదేశాలు సైతం అందినట్లు తెలుస్తోంది. అయితే ఇవేం పట్టనట్టు హన్మంతరావు తీర్థయాత్రల్లో గడిపేస్తున్నారని.. ఇలాగే కొనసాగితే గెలుపునకు ఇబ్బంది ఏర్పడొచ్చని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మైనంపల్లికి కాంగ్రెస్ నుంచి మెదక్, మల్కాజ్‌గిరి స్థానాలకు హామీ దక్కినట్లు తెలుస్తోంది.