
ప్రపంచ సినీచరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్(Oscar Awards 2026). ఆయా విభాగాల్లో ఉత్తమ సినిమా మొదలుకొని నటీనటులు, డైరెక్టర్లు, సింగర్లు ఇలా ప్రతి కేటగిరీ నుంచి అత్యుత్తమ ప్రతిభను గుర్తించి ఈ అవార్డును ఏటా అందిస్తుంటారు. ఈ మేరకు 2026 ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఆస్కార్ అకాడమీ(Oscar Academy) పలు కొత్త విషయాలు వెల్లడించింది. ఈ మేరకు 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనున్నట్లు అకాడమీ తెలిపింది. అయితే ఈసారి కొన్ని కొత్త రూల్స్(New Rules)ను ప్రవేశపెట్టింది.
నామినేట్ చేసిన ప్రతి మూవీని చూస్తాం
ఆస్కార్ పోటీ జాబితాను 2026 జనవరి 22న వెల్లడించనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(Academy of Motion Pictures Arts and Sciences) తెలిపింది. పలు కేటగిరీల్లో ఓటింగ్ విధానంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. నామినేట్ చేసిన ప్రతి మూవీని అకాడమీ సభ్యులు కచ్చితంగా చూస్తారని తెలిపింది. ఈసారి ‘Achievement in Casting’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఈ విభాగానికి రెండు దశల్లో ఓటింగ్(Voting) ప్రక్రియ ఉంటుందని తెలిపింది.
ఈసారి కొత్తగా ఏఐ వినియోగం
ఈసారి కృత్రిమ మేధ (AI) ఉపయోగించి నిర్మించిన మూవీలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. అయితే ఇది ఇతర మూవీలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. కాగా లాస్ ఏంజెలెస్(Los Angeles)లోని డాల్బీ థియేటర్(Dolby Theatre)లో ఈ అవార్డుల వేడుక జరగనుండగా, జనవరి 2025 నుంచి డిసెంబర్ వరకు విడుదలైన మూవీలు ఆస్కార్ అవార్డులకు పోటీ పడనున్నాయి.