పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురువు, కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైనీ (60) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చైన్నైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు హుసైని (Shihan Hussaini) మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మరణంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు.
షిహాన్ హుస్సైనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
– శ్రీ పవన్ కళ్యాణ్ pic.twitter.com/tLnM5nLqXf
— Telugu Film PROs Association (@YourTFPA) March 25, 2025
వెళ్లాలనుకున్నా.. ఇంతలోనే
ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే ట్రైనింగ్ తీసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలియడంతో ఆయన ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేశాను. విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పాను. ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్లి ఆయణ్ను పరామర్శించాలని నిర్ణయించాను. అంతలోనే దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం.
ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి
చెన్నైలో హుస్సైనీ కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. నేను ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని. మొదట్లో నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకోలేదు. చాలా బతిమాలిన తర్వాత ఓకే అన్నారు. ఆయన వద్దే నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రం కోసం కిక్ బాక్సింగ్ కూడా ఆయన వద్దే నేర్చుకున్నాను. ఆయన శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్ధాయికి చేరారు. హుస్సైనీ తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆయనకు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుస్సైనీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.






