Mana Enadu : ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. శిక్షలు ఎంత కఠినతరం చేసినా.. ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలతో అమ్మాయిల ప్రాణాలను తీస్తున్న మృగాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. ఇటీవలే కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) మరవకముందే మరో ఘటన తెలంగాణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
స్నేహితుడే కదా అని వెళ్తే
వరంగల్ నగర శివారులోని ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (Pharmacy Student) అక్కడే హాస్టల్ లో ఉంటోంది. సెప్టెంబరు 15వ తేదీన యువతికి పరిచయం ఉన్న ఓ యువకుడు హాస్టల్ వద్దకు వచ్చాడు. ఆమెకు కాల్ చేసి కిందకు రమ్మన్నాడు. తెలిసిన వాడే కావడంతో ఆ యువతి కిందకు వెళ్లింది. తనతో మాట్లాడాలని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకోబోయాడు. అయితే అప్పటికే కారులో మరో ఇద్దరు ఉండటం గమనించిన ఆ విద్యార్థిని తాను రానని తెగేసి చెప్పింది.
బలవంతంగా మద్యం తాగించి
అయినా బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని నగరంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ మొదటి అంతస్తులో గది అద్దెకు తీసుకుని యువతికి బలవంతంగా మద్యం తాగించి తన స్నేహితులతో కలిసి సామూహిక హత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు సైలెంట్ అయిపోయింది.
సీసీటీవీ ఫుటేజీతో నిందితుల గుర్తింపు
ఇక ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంటికెళ్లిన బాధితురాలు ఇంట్లో వారికి ఈ విషయం చెప్పడంతో ఆమె తల్లి వరంగల్ పోలీసు కమిషనర్(Warangal Police Commissioner)ను కలిసి తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆయన సూచన మేరకు మంగళవారం రోజున ఇంతేజార్‌గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాలతో లాడ్జిలోని సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు.
నిందితులను పట్టించిన ఆధార్ కార్డు
ఆధార్ కార్డు సాయంతో బాధితురాలి మిత్రుడిని గుర్తించి అతడితో పాటు ఇంకొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలని వైద్యసాయం నిమిత్తం భరోసా కేంద్రానికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.