
రైతులకు గుడ్ న్యూస్. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ అమలు చేస్తున్న పీఎం-కిసాన్ (PM Kisan) 19వ విడత నిధులు విడుదలయ్యాయి. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున 19వ విడత నిధులను ప్రధాని మోదీ (PM Modi) విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు మోదీ తెలిపారు.
19వ విడత నిధులు విడుదల
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద అన్నదాతలకు ఏటా ఒక్కో విడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం రూ.6వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా.. ఇప్పటివరకు 18 వాయిదాల్లో 11 కోట్లమంది రైతులకు రూ.3.46లక్షల కోట్లు అందజేసింది. తాజాగా 19వ విడత నిధుల (PM Kisan 19th installment))ను ప్రధాన మంత్రి విడుదల చేశారు.
పీఎం కిసాన్ స్టేటస్ తెలుసుకోవాలంటే?
మరి పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమయ్యాయో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం మొదట మీరు పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోవాలి. అందుకోసం https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. ఆ వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది.