Mana Enadu : రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా(Drugs Supply), వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరాపై నిఘా పెడుతున్నారు. ఇక పబ్బులపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్స్ పై కఠిన చర్యలు తీసుకున్నారు.
జన్వాడ ఫాంపౌస్ పై దాడులు
అయితే తాజాగా డ్రగ్స్ పార్టీ జరిగినట్లు వచ్చిన సమాచారంతో జన్వాడలో ఫాంహౌస్(Janwada Farm House)పై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్‌లో శనివారం రాత్రి భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
ఒకరికి డ్రగ్స్ టెస్టు పాజిటివ్
ఈ పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్ష(Janwada Farmhouse Drugs) నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఒక కేసు, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద మరో కేసును పోలీసులు నమోదు చేశారు. అనంతరం పార్టీలో దొరికిన విదేశీ మద్యం, ఇతర మత్తు పదార్థాలను సీజ్ చేశారు.
ఇప్పుడు కేటీఆర్ ఏమంటారో?
అయితే జన్వాడ్ ఫామ్ హౌస్ లో పార్టీపై బీజేపీ స్పందించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేటీఆర్ బావ మరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్ పార్టీలా అని ప్రశ్నించారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై కేటీఆర్(KTR) ఇప్పుడేమంటారోనని నిలదీశారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో?నని వ్యాఖ్యానించారు.
వాళ్లందరినీ అరెస్టు చేయాలి
కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలని బండి సంజయ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు.