
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali khan) ఇంట్లోకి చొరబడి ఆయనపై ఓ దుండగుదు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నటుడు సైఫ్ అలీఖాన్ సతీమణి కరీనా కపూర్ (Kareena Kapoor) స్టేట్‌మెంట్‌ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు.
ఆరుసార్లు కత్తితో దాడి
ఈ సందర్భంగా ఆమె దాడి గురించి పోలీసులకు పలు విషయాలు తెలియజేశారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని ఆమె చెప్పారు. దాదాపు ఆరుసార్లు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడని వెల్లడించారు. అయితే అతడు ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదని చెప్పారు.
తెల్లవారుజామున దాడి
సైఫ్ అలీఖాన్ పటౌడీపై ఈనెల 16వ తేదీన తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన పిల్లలు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేయగా.. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో సైఫ్‌ను పలుమార్లు పొడిచి పారిపోయాడు.