
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోమ్ భుజాలోని తన నివాసంలో బుధవారం రాత్రి ఆయణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తరలించారు. సినీ పరిశ్రమపై పోసాని విమర్శలు చేశారని ఓబులవారిపల్లె వాసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అరెస్టు చేశారు.
కాసేపట్లో కోర్టుకు పోసాని
స్థానికుల ఫిర్యాదుతో పోసాని కృష్ణ మురళిపై పోలీసులు 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఇక ఇవాళ రాజంపేట కోర్టులో ఆయణ్ని హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో పోసాని (Posani Arrested)ని రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు.
రెచ్చిపోయిన పోసాని
వైఎస్సార్సీపీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు APFTVDC ఛైర్మన్‌గా పని చేసిన పోసాని కృష్ణ మురళి.. చంద్రబాబు నాయుడు (Chandrababu), పవన్ కల్యాణ్‌తోపాటు నారా లోకేశ్ (Nara Lokesh)ను దారుణంగా దూషించారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీల నేతలు పోలీసులకు పోసానిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్‌స్టేషన్‌లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయణ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.