కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) అంటే పెద్దగా తెలియకపోవచ్చు గానీ.. లవ్ టుడే హీరో అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రంలో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు ప్రదీప్. డెబ్యూ సినిమాతోనే అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon)’ అనే సినిమాతో థియేటర్లోల సందడి చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతోంది.
అంచనాలు తలకిందులు చేస్తూ..
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1500 స్రీన్లలో, ఇండియాలో 1000 స్క్రీన్లలో విడుదలైంది. తమిళ్ లో ఏజీఎస్ విడుదల చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని సెంటర్స్ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. మొదట్లో ఈ సినిమా మోస్తరు వసూళ్లు (Return Of The Dragon Collections) రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసినా.. వారి అంచనాలు తలకిందులు చేస్తూ రెట్టింపు కలెక్షన్లు రాబడుతోంది.
వరల్డ్ వైడ్ గా రూ.45 కోట్లు
ఇప్పటి వరకు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.5 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఇలాగే థియేటర్లు హౌస్ ఫుల్ అయితే వీకెండ్ వరకు రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమా నవ్విస్తూనే ఏడిపించేసిందని నెటిజన్లు అంటున్నారు.
బడ్జెట్ రూ.40 కోట్లు
ఇక ఈ సినిమా సంగతికి వస్తే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా మెప్పించింది. కేఎస్ రవికుమార్, గౌతమ్ మేనన్ వంటి డైరెక్టర్లు కీలక పాత్రల్లో మెరిశారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా విడుదలైన రెండ్రోజుల్లోనే రూ.45 కోట్ల వసూళ్లు రాబట్టింది.






