Mana Enadu : బ్యాడ్మింటన్ కోర్టులో అద్భుతమైన ఆటతో భారతదేశానికి పతకాల పండించిన స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) తన జీవితంలో మరో కొత్త చాప్టర్ ను ప్రారంభించింది. తాజాగా సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆదివారం నాడు ఆమె బంధుమిత్రుల సమక్షంలో ఏడడుగులు వేసింది.
ఒక్కటైన సింధు-సాయి
ఆదివారం రాత్రి 11.20 గంటలకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో.. సాయి-సింధు మూడుముళ్ల బంధం (PV Sindhu Datta Sai Wedding)తో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. అయితే వీరి వేడుకకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫొటోలు బయటకు రాలేదు. త్వరలోనే ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోనుంది. ఇక మంగళవారం రోజున హైదరాబాద్‌లో సింధు-సాయి రిసెప్షన్ జరగనుంది.
దత్తసాయి ఎవరంటే..?
ఇక సింధు భర్త సాయి వెంకట దత్త (Datta Sai) సంగతికి వస్తే ఆయన ప్రస్తుతం సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ప్రోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థను ఆయనే నెలకొల్పారు. సాయి తల్లి లక్ష్మి, తండ్రి గౌరెల్లి వెంకటేశ్వరరావు ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మాజీ అధికారి. జిందాల్ సౌత్ వెస్ట్ (JSW)తో సాయి తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించాడు. JSW సహ యజమానిగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్ జట్టు వ్యవహారాల్ని చూసుకున్నాడు.
ఆయన నాకు ఫ్యామిలీ ఫ్రెండ్
దత్తసాయి గురించి మాట్లాడుతూ.. ఆయన తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది సింధు. అయితే ఇద్దరూ తమ కెరీర్ లో బిజీగా ఉండటం వల్ల చాలా తక్కువగా కలిశామని తెలిపింది. ఆయన బ్యాడ్మింటన్ ఆడరు కానీ తన మ్యాచ్‌లన్నీ చూస్తారని వెల్లడించింది. ఇక సోషల్ మీడియాలో ఈ కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.






