
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వాతావరణం(Weather) మారిపోయింది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న టైమ్‌లో వాతావరణ శాఖ(IMD) ఓ చల్లని వార్త అందర్ని కూల్ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న సమయంలో వాతావరణం చల్లబడింది. చైనా(Chaina)లో ఏర్పడిన దట్టమైన మేఘాలను బంగాళాఖాతం(Bay of Bengal)లోని గాలులు.. బంగ్లాదేశ్, మధ్యప్రదేశ్ వైపు తీసుకొచ్చాయి. దాంతో ఇప్పుడు ఆ మేఘాలు మధ్యప్రదేశ్‌పై ఓ భారీ సుడిని ఏర్పరిచాయి. అంటే.. ఒక తుఫాను తరహాలో ఏర్పడింది. ఈ మేఘాలు ఇప్పుడు AP, తెలంగాణకు వస్తున్నాయి. వీటి వల్ల శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.
ఈదురు గాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: CM
ముఖ్యంగా తెలంగాణలో అర్ధరాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద(HYD) సహా పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వడగళ్లతో కూడిన వాన కురిసింది. ఈదురు గాలులు కూడా వీయడంతో మామిడి తోటల్లోని చెట్లపై ఉన్న పిందెలు, పూత నేలరాలిపోయింది. ఇక కళ్లాల్లో పెట్టిన వరిధాన్యం తడిసిపోయింది. ఎక్కువగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో వర్ష బీభత్సం కనిపించింది. ఈదురు గాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని CS శాంతికుమారి జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం
తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం చాలా బలంగా ఉందని IMD చెప్పింది. దీని వల్ల తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, లక్షద్వీప్‌లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని తెలిపింది. వానలతోపాటూ ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని చెప్పింది. అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది అని IMD స్పష్టంగా చెప్పింది. అటు ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో 2 రోజుల వరకూ వర్ష ప్రభావం ఉంటుందని వెల్లడించింది.