ManaEnadu : సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై ఇటీవల కేసులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా మహిళలను వేధించడం, అత్యాచారం వంటి కేసుల్లో వీరు చిక్కుకుంటున్నారు. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master Case) తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్టయ్యారు. ఇక తాజాగా ఓ యూట్యూబర్‌పై కేసు నమోదైంది.
హర్షసాయిపై రేప్ కేసు నమోదు
యూట్యూబర్ హర్షసాయి (Youtuber Harsha Sai) గురించి తెలియని వారుండరు. యూట్యూబ్‌లో ఇతను చాలా ఫేమస్. అయితే తాజాగా ఇతడిపై ఓ కేసు నమోదైంది. ఓ సినీ నటి.. హర్షసాయి తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తన నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు (Narsingi Police) కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు.
న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్
సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) వచ్చిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఒక రియాల్టీ షోలో పాల్గొన్న ఆమెకు హర్షసాయితో పరిచయం అయిందని వెల్లడించారు. ఒక ప్రైవేటు పార్టీలో కలిసి స్నేహంగా మెలిగిన హర్షసాయి.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం (Rape) చేసినట్లు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బాధితురాలి వద్ద అతను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం యువతిని కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆమె హర్షసాయి తండ్రి (Harsha sai Father)పైనా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ వీడియోలు తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఇతను హీరోగా బాధిత యువతి హీరోయిన్‌గా గతంలో ఒక సినిమాను ప్రారంభించారు.