
ఢిల్లీ కొత్త సీఎం (Delhi New CM) ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. హస్తిన నూతన సీఎంగా రేఖా గుప్తా (Rekha Gupta) ఎన్నికయ్యారు. పలువురు కీలక నేతల పేర్లు తెరపైకి వచ్చినా.. బీజేపీ హైకమాండ్ రేఖా గుప్తా వైపే మొగ్గు చూపడంతో ఆమెకు పగ్గాలు అప్పగించింది. షాలిమార్‌బాగ్ నుంచి రేఖ.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఏబీవీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా.. బీజేపీలోని పలు విభాగాల్లో క్రియాశీలంగా పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా.. సౌత్ ఢిల్లీ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ సీఎంగా ఆమె గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2025) బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసింద. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం రోజున రాంలీలా మైదానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.34 గంటల వరకు ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలతో పాటు బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.