
నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel Collapse) 14వ కిలో మీటర్ వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృతేదేహాలు రెస్క్యూ టీమ్ కు లభించాయని గత కొంతసేపటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదంతా అవాస్తవం అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు.
అవి డెడ్ బాడీస్ కావు
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి కనిపించింది అని కలెక్టర్ తెలిపారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 మెత్తని భాగాలను గుర్తించిన రెస్క్యూ టీమ్.. చిక్కుకున్న వారు అక్కడే ఉన్నారని భావిస్తున్నారు.
కాసేపట్లో క్లారిటీ
అయితే ఈ మెత్తని భాగాలను మృతదేహాలు అని కొందరు భావిస్తున్నారు. అధికారులు మాత్రం అది అవాస్తవం అని కొట్టిపారేస్తున్నారు. మెత్తని భాగాలు ఉన్న చోట తవ్వకాలు జరిపిన తర్వాత అవి మృతదేహాలా కాదా అనేది క్లారిటీ వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనలో గల్లంతైన వారి పరిస్థితిపై కాసేపట్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.