Mana Enadu : శబరిమల అయ్యప్ప దర్శనం (Sabarimala) విషయంలో ఇటీవల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ (Makaravilakku season) ప్రారంభం కానున్న వేళ ఈ నిర్ణయం వెల్లడించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
వెనక్కి తగ్గిన కేరళ సర్కార్
అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలన్న తమ నిర్ణయాన్ని తాజాగా కేరళ ప్రభుత్వం (Kerala Govr) వెనక్కు తీసుకుంది. సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోయినా భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Kerala CM Vijayan) అసెంబ్లీలో స్పష్టం చేశారు.
అందరికీ దర్శనం
వర్చువల్ నమోదు గురించి తెలియకుండా వచ్చిన వారికీ దర్శనం ఉంటుందని సీఎం తెలిపారు. ప్రమాదానికి గురైనప్పుడు లేదా తప్పిపోయినప్పుడు భక్తులను గుర్తించేందుకు ఆన్‌లైన్ నమోదు (Sabarimala Online Booking) ఉపయోగపడుతుందని .. ఈ విధానం తిరుపతిలోనూ అమల్లో ఉందని గుర్తు చేశారు. గతేడాదిలానే స్పాట్ బుకింగ్ విధానాన్ని కొనసాగించనున్నారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
స్పాట్ బుకింగ్ పై నో క్లారిటీ
అయితే.. గతేడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడటంతో చాలా మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్(Sabarimala Spot Booking)లను దేవస్థానం బోర్డు రద్దు చేసింది.