
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) ప్రధాన పాత్రలో రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన సినిమా ‘మజాకా (Mazaka)’. త్రినాథ్ రావు తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా ఎవర్ గ్రీన్ హీరోయిన్ అన్షు రీఎంట్రీ ఇచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రోజున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దామా..?
సినిమా : మజాకా
నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూవర్మ, అన్షు, మురళీశర్మ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : ప్రసన్న కుమార్ బెజవాడ, సాయికృష్ణ
మ్యూజిక్ : లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
నిర్మాత : రాజేశ్ దండ
డైరెక్టర్ : త్రినాథరావు నక్కిన
రిలీజ్ డేట్ : 26-02-2025
రేటింగ్ : 2.25/5
మజాకా స్టోరీ ఇదే :
వెంకటరమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. తన కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫొటోని చూసుకోవాలని వెంకటరమణ ఆశ పడుతుంటాడు. కానీ ఎవ్వరూ తనకు అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలన్నీ తీరుతాయని కొందరు సలహా ఇస్తారు. అదే సమయంలో అతడికి కనిపించిన యశోద (అన్షు)తో ప్రేమలో మునిగిపోతాడు వెంకటరమణ. మరోవైపు కొడుకు కృష్ణ మీరా (రీతూ వర్మ)తో ప్రేమలో పడతాడు. మరి వీళ్ల ప్రేమకథల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ (మురళీశర్మ)కు, ఈ తండ్రీకొడుకులకు మధ్య సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మూవీ ఎలా ఉందంటే?
ఈ సినిమాలో తండ్రి ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలు చాలా హాస్యం కలిగిస్తాయి. లాజిక్ కోసం చూడకుండా సినిమా చూస్తే హాయిగా నవ్వుకోవచ్చు. ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఇంటిల్లిపాదితో కలిసి జాలీగా చూడగలిగేలా ఫ్రెష్ కామెడీతో మెప్పించింది ఈ సినిమా. తండ్రీకొడుకుల లవ్ స్టోరీతో ఫస్టాఫ్ సాగిపోతుంది. అంచనాలకు విరుద్ధంగా సెకండాఫ్ సాగుతుంది. సెకండాఫ్ లో ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. స్టోరీని ముగించిన తీరు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే?
సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య బంధం ఈ సినిమాకు కీలకం. సందీప్‌కిషన్ పక్కింటి కుర్రాడిలా తన నటనతో ఆకట్టుకున్నాడు. మంచి టైమింగ్ తో కామెడీ అదరగొట్టాడు. ఇక లేటు వయసులో ప్రేమలో పడిన వ్యక్తిగా రావు రమేష్ తన పాత్రలో అదరగొట్టారు. అయితే ఆయన లవ్ లెటర్ పట్టుకుని హీరోయిన్ చుట్టూ తిరగడం అంతగా కుదరలేదు. ఇక మురళీశర్మ పాత్ర, ఆయన నటన సినిమాకు ప్రధానబలం. రీతూవర్మ, అన్షు బలమైన పాత్రల్లోనే ఆకట్టుకున్నారు. రచన పరంగా ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది.
ప్లస్ పాయింట్స్
+ కామెడీ
+ సెకండాఫ్ లో ట్విస్టులు
+ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
– ఊహకు అందే కథ, కథనాలు
కన్ క్లూజన్ : తండ్రీకొడుకుల లవ్ స్టోరీయా ‘మజాకా’