ManaEnadu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్ తాజాగా సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల వెంకన్న లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు, తిరుమలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సిట‌్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది.
గుంటూరు ఐజీగా త్రిపాఠి
2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సర్వస్రేష్ఠ త్రిపాఠి గతంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా పని చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీగా పని చేస్తున్న పాలరాజుని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్ .. ఆయన స్థానంలో త్రిపాఠిని నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఐజీగా కొనసాగుతున్నారు.
లడ్డూ వ్యవహారంపై సిట్
తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఏపీలోని కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ ఘటను బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తుండటంతో ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేశారు.
ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నోటీసులు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై సిట్ విచారణ జరపనుంది. మరోవైపు తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు తెలిపింది