Mana Enadu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం (Tirumala Laddu Controversy) దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. తాజాగా ఈ విషయంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిపింది. ఈ మేరకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం లడ్డూ కల్తీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతూనే.. లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగించాలా? లేదా అని సహకారం ఇవ్వాలని ఎస్జీని సుప్రీంకోర్టు కోరింది.
కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమిది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? అనేది కేంద్ర ప్రభుత్వం (Central Govt) చెప్పాలి. సిట్‌ను కొనసాగించాలో లేదో కూడా చెప్పాలి. సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటి అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీ (TTD)ని ప్రశ్నించింది. అనంతరం విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి(BJP), వైవీ సుబ్బారెడ్డి(YSRCP), రచయిత విక్రమ్ సంపత్, పలువురు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రసాదం కల్తీ (Tirumala Laddu Adulteration)పై వాస్తవాలు తేల్చాలన్న సుబ్రహ్మస్వామి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కోరగా.. ప్రసాదం కల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.