Mana Enadu : ఛైల్డ్ పోర్నోగ్రఫీ (Child Pornography) చూడటం, వీడియోలు డౌన్లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్న్ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబరు 23వ తేదీ) తీర్పు వెల్లడించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని స్పష్టం చేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది.
కేంద్రానికి సుప్రీం సూచనలు
ఇలాంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పోక్సో చట్టంలో ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ (Child Pornography)’ అనే పదాన్ని ‘ఛైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్’ అనే పదంతో మారుస్తూ సవరణలు చేయాలని కేంద్రానికి సూచించింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని పేర్కొంది. ఇకపై కోర్టులు ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’ పదాన్ని ఉపయోగించవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీం ఆదేశాలు
ఛైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాసు హైకోర్టు (Madras High Court) ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై పలు ఎన్జీవోలు, చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా హైకోర్టు తీర్పును తోసిపుచ్చుతూ.. సదరు యువకడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది.