మన ఈనాడు:cఉన్న విషయం వెలుగు లోకి వచ్చింది. సదరు అధికారికి శివ బాలకృష్ణ పలు దఫాలుగా రూ. 10 కోట్లు ముట్ట జెప్పినట్లు.. ఆయన చెప్పిన ఫైళ్లకు వెనువెంటనే అనుమతులు ఇచ్చినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తేల్చింది. అంతేకాదు.. ఆ అధికారి సూచించిన మేరకే అక్రమంగా సంపాదించిన డబ్బుతో శివ బాలకృష్ణ వరంగల్ వైపు భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించింది..
విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించినట్లు సమాచారం. తనకు చెందిన పలు బిల్డింగులకు బాలకృష్ణతో ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నార్సింగిలోని ఓ కంపెనీకి చెందిన 12 ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చేందుకు 10 కోట్లు డిమాండ్ చేయగా… సదరు సంస్థ కోటి రూపాయలు ఇచ్చింది.
డిసెంబర్‌లో అరవింద్ ఇంటికి వెళ్లి ఆ డబ్బును శివబాలకృష్ణ అందించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలను అరవింద్ డిమాండ్ చేశారని రిపోర్టులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మహేశ్వరం మండలం మంకల్ వద్ద వర్టెక్స్ భూములకు క్లియరెన్స్ ఇచ్చినందుకు అరవింద్‌కు ఓ ఫ్లాట్‌ను బహుమానం చేసిందిన రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణకు చెందిన 214 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించగా.. అందులో సింహ భాగం– 102 ఎకరాలు జనగామ జిల్లా లోనే ఉండడం గమనార్హం.
శివ బాలకృష్ణ వాంగ్మూలంలో చెప్పిన విషయాలను క్రాస్ చెక్ చేసుకునే పనిలో ఏసీబీ నిమగ్నమైంది. ఇప్పటికే శివ బాలకృష్ణ ఫోన్ ను సీజ్ చేసి, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) ను సేకరించగా.. సదరు ఐఏఎస్ అధికారితో జరిగిన సంభాషణలు, చాటింగ్ వివరాలను (ఇంకా కొంత డేటాను రిట్రీవ్ చేయాల్సి ఉంది) వెలికి తీస్తోంది. శివ బాలకృష్ణ చెబుతున్న రోజుల్లో సదరు ఐఏఎస్ అధికారి నుంచి ఫోన్లు వచ్చాయా.? ఆ అధికారికి డబ్బులిచ్చానని చెబుతున్న సమయంలో.. ఆ ప్రాంతాల్లో సెల్ టవర్ లోకేషన్ వివరాలు ఏం చెబుతున్నాయి.? ఇద్దరి టవర్ లొకేషన్ ఒకటేనా.? అనే కోణాలతో పాటు.. వీలైన చోట్ల సీసీటీవీ ఫుటేజీ సేకరణపై దృష్టి సారించింది.
రెండు డొల్ల కంపెనీలు..
ఏసీబీ అరెస్టు చేసిన శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరి నుంచి ఎంత మొత్తం తీసుకోవాలి.? వాటిని ఎక్కడికి మళ్లించాలి.? ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి?.. ఇలా అన్ని వ్యవహారాలను నవీన్ కుమార్ చక్కబెట్టే వాడని వివరించాయి. నిధులను దారి మళ్లించేందుకు నవీన్ కుమార్ రెండు డొల్ల కంపెనీ లను ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలను సేకరించారు. ఆ కంపెనీల పేర్లతో ఆదాయ పన్ను (ఐటీ) సైతం చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు నవీన్ కుమార్ సరిగా సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో.. డాక్యుమెంట్స్, టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టిసారించారు. నవీన్ కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మరోవైపు, శివ బాలకృష్ణ వాంగ్మూలంలో పేర్కొన్న స్థిరాస్తి సంస్థలకూ నోటీసులు జారీ చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కూడా పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను విచారించినా.. ఇప్పుడు శివ బాలకృష్ణ వాంగ్మూలం మేరకు వారిని ప్రశ్నించ నున్నట్లు స్పష్టమవుతోంది..