
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు.. అప్పుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కొత్త మంత్రుల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కేబినెట్ విస్తరణ జరిగి తీరాల్సిందేనని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరికొందరు ముఖ్య నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు.
కేబినెట్ విస్తరణకు పచ్చజెండా
ఈ నేపథ్యంలో ఏఐసీసీ (AICC) పెద్దలతో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ, రాష్ట్ర తాజా రాజకీయాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు వంటి ముఖ్య అంశాలపై హైకమాండ్ తో చర్చించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 3వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు (Four New Ministers in Telangana) భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
మంత్రి పదవి రేసులో
ఇందులో ఇద్దరు బీసీలు, ఒకటి రెడ్డి, మరొకటి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు లభించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) నుంచి అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ.. రాష్ట్ర కోర్ కమిటీ నుంచి వివరాలు తీసుకుంది. అయితే కొత్త మంత్రుల రేసులో సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి (MLA Rajagopal Reddy), మల్‌రెడ్డి రంగారెడ్డి ఉండగా.. ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆ నలుగురు మంత్రులు వీళ్లే
అయితే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలిసింది. మరోవైపు బీసీలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్ (Adi Srinivas) మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy)కి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేయాలనుకుంటున్న ఏఐసీసీ.. మైనారిటీలకు కూడా అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే.. ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.