Mana Enadu: తెలంగాణ డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబరు 30వ తేదీన) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మంగళవారం రోజున (అక్టోబర్ 1వ తేదీన) ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి ప్రకటించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు మొబైల్ ఫోన్ (ఎస్ఎంఎస్) రూపంలో సమాచారం అందించనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా డీఈఓలు ప్రకటిస్తారని వెల్లడించారు. అభ్యర్థులు డీఈఓలు గుర్తించిన కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరు కావాలని నరసింహా రెడ్డి స్ఫష్టం చేశారు.
మార్చి 1వ తేదీన 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. దసరాలోపు ఎల్బీస్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఫలితాల కోసం https://tgdsc.aptonline.in/tgdsc/ ఇక్కడ క్లిక్ చేయండి.