Mana Enadu : రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడంపై ప్రభుత్వం (Telangana Govt) దృష్టి పెట్టింది. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమి లేకుండా, కూలీ పనులు చేసుకొని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నాయని తెలగా.. 70 లక్షల మంది పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులున్నట్లు రెవెన్యూ రికార్డులు తేల్చాయి.
53 లక్షల మందికి ఉపాధి హామీ కార్డులు
ఇక మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదని (Landless Labor in Telangana) సర్వే తెలిపింది. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలిసింది. అలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నాయి. అయితే వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజూ కూలీ పనులకు వెళ్తున్నట్లు కార్డులు చలామణిలో ఉన్నాయి.
వారికే రూ.6వేల ఆర్థిక సాయం
ఇక ఈ కార్డుదారుల్లో భూమి లేని వారు దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉంచవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరికే ఇప్పుడు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం (Rs.6000 Assistance) ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంవత్సరానికి రెండు విడతల్లో మొత్తం రూ.12వేలు సాయం అందించనుంది. దీని కోసం దాదాపు రూ.1000 కోట్ల వరకూ అవసరం ఉంటుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. ఏ ప్రాతిపదికన ఈ సాయం అందజేస్తుందనే విషయం మాత్రం కసరత్తు పూర్తయితే గానీ తెలియదు.
సంక్రాంతికి రైతు భరోసా
ఈ పథకంతో ఒక్కో నిరుపేద కూలీ కుటుంబానికి సంవత్సరానికి రెండు విడతలుగా రూ.12 వేలు అందనున్నాయి. అందులో తొలి విడతగా రూ.6 వేలను ఈ నెల 28న విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti VIkramarka) ప్రకటించారు. మరోవైపు ఈ సంక్రాంతికి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగం చేసినట్లు భట్టి తెలిపారు.






