
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session 2025) గురువారానికి వాయిదా పడ్డాయి. అనంతరం శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 19వ తేదీన రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget 2025-26)ను ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. మరోవైపు ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో ప్రారంభమైన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు.