-By Roja
మన ఈనాడుః ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో గంటగంటకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈక్రమంలో కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగేందుకు జలగం వెంకట్రావు రెడీ అయ్యారని సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (Jalagam Venkatrao) బీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కారు గుర్తుపై గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా జలగం రికార్డు సృష్టించారు. అయితే 2018లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వనమా బీఆర్ఎస్ గూటికి చేరారు.
దీంతో జలగం వెంకట్రావుకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్ కూడా రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అందుకు కాంగ్రెస్ కూడా ఓకే చెప్పింది. కానీ పొత్తుల్లో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును సీపీఐకి కేటాయించడంతో జలగం కాంగ్రెస్ లో చేరిక ఆగిపోయింది.
కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతో బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేసేందుకు వెంకట్రావు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ కేడర్ తనకే అండగా నిలిచే అవకాశం ఉందని జలగం అంచనా వేస్తున్నట్లు సమాచారం. రేపు జలగం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జలగం పోటీ చేయడంతో నియోజకవర్గంలో పరిస్థితులు మారుతాయన్న చర్చ సాగుతోంది.







