మన ఈనాడుః ఉచిత బస్సు ప్రయాణం పథకానికి మహిళ నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 11 రోజుల్లోనే 3 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 2,500 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
“ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోంది. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్ లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నాం. ఫొటో కాపీలను స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. అతి తక్కువ టైంలోనే ఈ స్కీంను అర్థం చేసుకుని.. చాలా చిత్తశుద్ధితో సమర్థవంతంగా ఈ స్కీంను విజయవంతంగా అమలు చేస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు వీసీ సజ్జనార్. ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ మర్యాదపూర్వకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.