
మరో వారంలో మహాశివరాత్రి (Maha Shivratri) పండుగ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా శైవక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగ సందర్బంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించింది. వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
అదనపు బస్సులు
మహాశివరాత్రి ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట్లపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తన అధికారిక నివాసంలో ఆయా అధికారులతో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది కంటే ఈ ఏడాది మహాశివరాత్రికి భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. రద్దీ అధికంగా ఉండకుండా సరిపడా బస్సులు (Special Buses) ఏర్పాటు చేయాలని సూచించారు.
సీఎం రేవంత్ కు ఆహ్వానం
మరోవైపు ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో (Vemulawada Temple) ఘనంగా వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో ఫిబ్రవరి 25, 26, 27వ తేదీల్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.