మన ఈనాడు:కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీనికితోడు కాంగ్రెస్ ద్వితీయ నాయకత్వం 2018 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరింది.
ఒకరు సీఎం, ఇంకొకరు సీఎం రేసులో ఉన్న అభ్యర్థి. ఇద్దరూ రాజకీయాల్లో దిగ్గజాలే. ఓ వైపు కేసీఆర్, మరోవైపు రేవంత్‌రెడ్డి ఇద్దరూ మాటలతో జనాల్ని ఆకట్టుకునే నేతలే. అలాంటి ఇద్దరు నాయకుల్ని ఎదుర్కొని విజేతగా నిలిచారు కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి. దేశం దృష్టిని ఆకర్షించిన ఈ జెయింట్ కిల్లర్ కేసీఆర్‌పై 6వేల 741 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపునకు అనేక అంశాలు ప్రభావితం చేశాయి. స్థానికంగా BRS నాయకులు, కార్యకర్తల మధ్య కుమ్ములాటలు ఆ పార్టీ బలహీనపడేందుకు ఓ కారణమని ప్రచారం జరుగుతోంది. మల్డీ లీడర్ షిప్ కారణంగా పోల్ మేనేజ్‌మెంట్ సక్రమంగా సాగలేదనే చర్చ వినిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేసేందుకు కామారెడ్డిని ఎంచుకోవడంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్ని అధికారపార్టీ నేతలు తిప్పి కొట్టలేకపోయారు. వెంకటరమణారెడ్డి విజయానికి ఇదో ప్లస్ పాయింట్‌గా మారింది.
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీనికితోడు కాంగ్రెస్ ద్వితీయ నాయకత్వం 2018 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరింది. దీంతో కొన్ని గ్రామాల్లో ఆ పార్టీకి ప్రచారం చేయడానికి కూడా నాయకులు లేకుండా పోయారు. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి నియోజకవర్గంలో మకాం వేసి ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
వెంకటరమణారెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీచేశారు. అప్పుడు ఓడిపోవడంతో ఆ తర్వాత పంచాయతీ, పురపాలక సంఘ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడారు. ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కరించాలని, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ నిధులు మంజూరుచేయాలని ఉద్యమాలు చేపట్టారు. ఏడాది కాలంగా నియోజకవర్గమంతా కులసంఘాల భవనాలను, ఆలయాలను సొంత నిధులతో నిర్మించారు. ఇలా తాను చేసిన కార్యక్రమాలతో అన్నివర్గాల ప్రజల ఆమోదం పొంది ఎన్నికల్లో విజయం సాధించారు.