మన ఈనాడు: Praja Darbar : CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. నేటి ఉదయం 10 గంటలకు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు అని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదని, ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తానన్నారు. కాగా ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా సీఎం రేవంత్ చర్యలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రతి సామాన్య వ్యక్తి వచ్చి తన సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని.. సీఎం రేవంత్ రెడ్డి మొదట నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్పిన విధంగానే ప్రగతి భవన్ కంచెను తొలగించారు. ఇక ఈ రోజు నుంచే ప్రజా దర్బార్ ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు జిల్లాల నుంచి ప్రజలు, నిరుద్యోగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్‌కు చేరుకున్నారు.