By Mahesh
మన ఈనాడు: ఆరు సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసి రాజకీయాల్లో 40 సంవత్సరాలు సుధీర్ఘ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఓటమి భయం పట్టుకుంది. ప్రత్యర్ధిగా పోటీ చేసేది బీటెక్ పూర్తి చేసిన 26 ఏళ్ల యశస్విని రెడ్డినే.ఎమ్మెల్యేగా గెలిపించండి.. తనకు వచ్చే గౌరవ వేతనాన్ని ప్రజలకు విరాళంగా ఇస్తానని యశస్విని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. 2009 ఎన్నికల్లో కూమారిగానే వైరా నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో చంద్రావతి అడుగుపెట్టింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎమ్మెల్యే అయ్యాక పెళ్లి చేసుకుంది. తాజాగా అతి చిన్న వయస్సురాలిగా యశస్వినే తెలంగాణ అసెంబ్లీ గళం వినపించబోతుందని స్థానికులు చర్చకు తీసుకొస్తున్నారు.
Yashaswini Reddy : రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం పాలకుర్తి. ఈజీగా మరోసారి గెలవొచ్చు అనుకున్న మంత్రి ఎర్రబెల్లికి టెన్షన్ తప్పడం లేదు. గతంలో వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఎర్రబెల్లి ఇప్పుడు సొంత నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదు. ఇందుకు కారణం ఆయనపై పోటీ చేస్తున్న 26 ఏళ్ల అభ్యర్థి యశస్విని రెడ్డి. తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో యశస్వినీ పిన్న వయస్కురాలు కావడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నారు.
రాజకీయాల్లోకి యువత రావాలి. మహిళలు రావాలి. ఇది అందరూ ఎప్పుడూ చెప్పే మాటే.కానీ ఇప్పుడు ఆ మాటను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ.. అత్యంత పిన్న వయస్కురాలికి పాలకుర్తి టిక్కెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది. రాజకీయాలు అంటే ఎప్పుడూ దశాబ్దాల తరబడి పాతుకుపోయిన వారే కాదు. యువత రావాలి అన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు జనగామ జిల్లా పాలకుర్తి బరిలో మంత్రి ఎర్రబెల్లిపై పోటీకి యశస్విని రెడ్డి సై అంటున్నారు .
సీనియర్ మోస్ట్ లీడర్లే రాజకీయాన్ని శాసించాలా అన్న ప్రశ్నలను.. యువత వినిపిస్తోంది. ఇప్పుడు యశస్విని రెడ్డి పోటీపై దేశవ్యాప్తంగా మంచి టాక్ వస్తోంది. పాలకుర్తి యువత కూడా 26 ఏళ్ల యశస్విని పోటీని స్వాగతిస్తున్నారు. తమ నియోజకవర్గానికి ఇప్పటికైనా దశ తిరుగుతుందని అనుకుంటూ స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఏ శాసనసభకైనా యువ నాయకత్వం కూడా అవసరమే. ఇప్పుడు యశస్విని రూపంలో యువతకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. యువత రాజకీయాల్లో వస్తే సరికొత్త ఆలోచనలతో సరికొత్తగా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు జరుగుతాయన్న అభిప్రాయం ఉంది. సంపద పోగేయడం కాదు.. సంపదను ఎలా పంచాలి… అందరినీ అభివృద్ధిపథంలోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై యువ నాయకులు క్లారిటీతో ఉంటారు. సగం సగం హామీలు ఇచ్చి జనాన్ని నడిసముద్రంలో వదిలేసే నాయకులను చూస్తుంటాం. కానీ యువత రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు పూర్తిగా మారుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
హనుమాండ్ల యశస్విని రెడ్డి రాజకీయాల్లోకి వస్తూనే.. తన మనసులో ఉన్న విషయాలను నియోజకవర్గ ప్రజలతో పంచుకున్నారు. పాలకుర్తిలో గెలిస్తే తన ఐదేళ్ల ఎమ్మెల్యే వేతనాన్ని పాలకుర్తి ప్రజాసంక్షేమ కార్యక్రమాలకే డొనేట్ చేస్తానని ప్రకటించారు. ఈ మాట చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. ఇలా ఎవరూ చెప్పని మాట. యువ అభ్యర్థి కావడంతో ఆలోచనలు కూడా సరికొత్తగా ఉంటాయనడానికి ఈ హామీనే నిదర్శనం అంటున్నారు యువత. వేతనాన్నే విరాళంగా ఇస్తానని ప్రకటించారంటే.. తన పరిధిలోకి వచ్చే నిధులను సంపూర్ణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత పకడ్బందీగా చేరవేస్తారో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
సామాన్య ప్రజల్లో విశ్వాసం పెంచేలా దేశానికి యశస్విని రెడ్డి లాంటి యువనాయకత్వం అవసరం అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. యువత తలచుకుంటే ఏదైనా జరిగి తీరుతుంది. ఇప్పుడు పాలకుర్తిలో యశస్విని చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు. అందుకే మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గాన్ని వీడడం లేదు. గతంలో పక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఎర్రబెల్లి ఇప్పుడు సొంత సెగ్మెంట్ పై ఫోకస్ పెంచారు. యువత టర్న్ అయితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే అలర్ట్ అవుతున్నారు. మరి యువనాయకత్వాన్ని పాలకుర్తి ప్రజలు ఎంత వరకు సమర్థిస్తారన్నది డిసెంబర్ 3న తేలనుంది.