KCR వస్తేనే సంక్షేమం..కాంగ్రెస్​ వస్తే రాంరాం!

మన ఈనాడు:

ఈ రోజు జడ్చర్లలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఏ మూలకు పోయిన ఏడుపు వచ్చేదన్నారు. నేడు స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రొ.జయశంకర్ చెప్పినందుకు మహబూబ్ నగర్ నుంచి తాను గతంలో ఎంపీగా పోటీ చేశానన్నారు. నేను మహబూబ్ నగర్ ఎంపీ గా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యమంలో పక్కన కృష్ణమ్మ ఉన్నా.. లభమేమి లేకపాయే అనే పాటను తానే రాశానని గుర్తు చేశారు.
క‌రువు అనేది మ‌న‌దిక్కు క‌న్నెత్తి కూడా చూడ‌దు..
ఇదే జిల్లాలో పుట్టిన ద‌రిద్రులు, కాంగ్రెస్ నాయ‌కులు పోయి కేసులు వేస్తారని కేసీఆర్ మండిప‌డ్డారు. అది కావొద్దు.. అది అయితే ల‌క్ష్మారెడ్డికి, శ్రీనివాస్ గౌడ్‌కు పేరు వ‌స్తదన్నారు. కేసీఆర్‌కు పేరు వ‌స్తుంద‌ని అడ్డు ప‌డుతున్నారు. మొండిప‌ట్టుతో పోయాం. తొమ్మిదేళ్ల పోరాటం త‌ర్వాత అనుమ‌తులు వ‌స్తున్నాయి. ధ‌ర్మం గెలుస్తది. న్యాయం గెలుస్తది. నార్లాపూర్, ఏదుల‌, వ‌ట్టెం, క‌రివెన‌, ఉద్ధండ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్లు పూర్తయ్యాయి. మోటార్లు బిగిస్తున్నారు. మూడు నాలుగు నెల‌ల్లో నీళ్లు చూడ‌బోతున్నాం. పాల‌మూరు క‌రువు పోత‌ది. ఉద్ధండ‌పూర్ పూర్తయితే.. జ‌డ్చర్ల స‌స్యశ్యామ‌లం అవుతుంది. జ‌డ్చర్లలో ల‌క్షా 50 వేల ఎక‌రాల‌కు నీళ్లు వ‌స్తాయి. క‌రువు అనేది మ‌న‌దిక్కు క‌న్నెత్తి కూడా చూడ‌దు. స‌స్యశ్యామ‌లం కాబోతుంది అని కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ చాలు అని కడుపులో ఉన్న మాటను కక్కిండని ధ్వజమెత్తారు. భారతదేశం మొత్తంలో 24 గంటల కరెంట్ ఇచే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్ అని అన్నారు. లక్ష్మారెడ్డిని మరో సారి గెలిపించాలని ఓటర్లను కోరారు కేసీఆర్.

రానున్న 3, 4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో నీళ్లను చూస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయితే కరువు అనేది ఈ ప్రాంతాన్ని కన్నెత్తి కూడా చూడదన్నారు.

Share post:

లేటెస్ట్