Mana Enadu: పదేళ్లుగా దేశాన్ని పాలించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణకు చేసింది ఏమీ లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గం చింతకానిలో(Chintakani) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ.. మోదీ అందరినీ ముంచారని అన్నారు.
ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉండి.. అన్నీ నిర్వీర్యం చేశారని, ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగ వ్యవస్థనే దెబ్బతీస్తారని తెలిపారు. రిజర్వేషన్లు ఎత్తివేసి నిరంకుశంగా వ్యవహరిస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, అందరూ హస్తం గుర్తుపై ఓటెయ్యాలన్నారు. Khammam కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి భారీ మెజారిటీ అందించాలని కోరారు.
మాది పేదల ప్రభుత్వం: భట్టి
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందేలా పరిపాలన సాగుతోందని, ముమ్మాటికీ తమది పేదల ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు లబ్ధి కలిగేలా తమ విధానాలు ఉంటున్నాయనీ చెప్పారు. బీజేపీ దేశ సంపదను దోచుకుంటోందని తెలిపారు. నల్లధనం రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్న ప్రధాని.. ఇంతవరకు ఎందుకు ఆచరణలో చూపలేదని ప్రశ్నించారు.
గతంలోని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరిచిందన్నారు. తమ పాలనలో 65 లక్షల మందికి రైతుబంధు వేశామని చెప్పారు. కేసీఆర్ దద్దమ్మలు, సన్నాసులు.. అంటూ పెద్ద పదాలను ఉపయోగిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. ఒకప్పుడు జొన్న చెలతో.. బుడం దోసకాయలతో కనిపించిన భూములు ఇప్పుడు సస్యశ్యామలంగా మారుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నాయకులు రాయల నాగేశ్వరరావు మండల కాంగ్రెస్ అద్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు మరియు ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు