Mana Enadu:తెలంగాణలో రైతు బంధు స్కీమ్ పేరు త్వరలో రైతు భరోసాగా మారనుంది. ఎన్నికల హామీ మేరకు ఈ స్కీమ్ కింద రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించనుంది రేవంత్ సర్కార్. అయితే.. రాళ్లు, రప్పలు, వెంచర్లకు కూడా కేసీఆర్ సర్కార్ పెట్టుబడి సాయం అందించిందని.. మేం అలా చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి సంకేతాలు ఇస్తోంది. ఈ మేరకు విధివిధానాలను రూపొందించడానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కేవలం సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సాగు చేయని వ్యవసాయ భూములకు రైతు భరోసా నిలిపివేసే అవకాశం ఉంది.
ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాల రూపకల్పనకు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేక ఫార్మాట్‌లో రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పంట భూములను సైతం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనంతరం వారు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది.
గతేడాది, ప్రస్తుతం సాగు చేయని భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అందుకు గల కారణాలను నమోదు చేస్తున్నారు. అయితే.. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కటాఫ్ గా ఐదు ఎకరాలే ఉంచాలా? అసలు కటాఫ్ ఉండాలా? వద్దా? అన్న అంశంపై సైతం ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.