నేనే అబ్బాయిని అయితే.. బతికుండేదాన్ని.. డాక్టర్ రేప్ ఘటనపై హీరో ఎమోషనల్ కవిత

ManaEnadu:’నేనూ రూమ్ డోర్ లాక్ చేయకుండానే పడుకునేదాన్ని ఒకవేళ నేనే అబ్బాయిని అయితే. స్వేచ్ఛగా తిరిగేదాన్ని, భయపడకుండా రాత్రంతా స్నేహితులతో సరదాగా గడిపేదాన్ని.. ఒకవేళ నేనే అబ్బాయిని అయితే. ఆడపిల్లలను చదివించాలి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు స్వశక్తితో నిలబడేలా చేయాలని అందరూ చెబుతుంటే విన్నాను. అలా నేను కూడా చదివి డాక్టర్ కాకపోయుంటే.. ఇవాళ నా తల్లి తన కంటిపాప అయిన నన్ను కోల్పోయి ఉండేది కాదు.. నేనే అబ్బాయిని అయి ఉంటే.’ అంటూ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం ఘటనపై స్పందిస్తూ ఓ ఎమోషనల్ కవిత రాశారు. ఆ కవితను స్వయంగా తానే చదువుతూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఉద్వేగభరితంగా ఉన్న ఆయన కవిత ఇప్పుడు అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనతో యావత్ భారత దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. ఈ అమానుష ఘటనపై ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్పందించారు. తాజాగా నటుడు ఆయుష్మాన్ ఖురాన్ స్వయంగా కవిత రాసి దాన్ని చదివి వినిపించారు.
ఇవాళ నాపై అత్యాచారం జరిగింది. ఆ దుర్మార్గుడి క్రూరత్వాన్ని నేను కళ్లారా చూశా. సీసీటీవీ ఉంటే బాగుండేదని అంతా అంటున్నారు. కానీ ఉంటే ఏమయ్యేది? సీసీటీవీ పర్యవేక్షిస్తున్న అతడు కూడా మగవాడే కదా. అతని చూపు నాపై పడి ఉండే అప్పుడేమయ్యేది. అందుకే నేనే అబ్బాయిని అయితే బాగుండేది. నేనే అబ్బాయిని అయుంటే ఇవాళ నేను బతికి ఉండేదాన్ని.. అంటూ బాధితురాలి ఆవేదనను ఆయుష్మాన్ కళ్లకు కట్టినట్లు తన స్వరంతో వినిపించారు. తన కవితలో ఆమె ఆవేదనను వినిపించారు ఆయుష్మాన్ ఖురానా. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది.

 

Share post:

లేటెస్ట్