Rains & Floods: వదలని వరుణుడు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు!

Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలట్లేదు. బంగాళాఖాతంలో తుఫాను తీరం దాటినా వానలు మాత్రం తగ్గట్లేదు. దీంతో AP, తెలంగాణలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు వాతావరణ శాఖ(IMD) మరో మూడు, నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల హెచ్చరికలతో ఇవాళ (మంగళవారం) కూడా పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. CS శాంతికుమారి ఆదేశాలకు మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. IMD హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.

 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

మరోవైపు ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదేశాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. HYD వాతావరణ కేంద్రం రిపోర్ట్ మేరకు మంగళవారం ADB, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, NML, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, PDPL, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, MHBD, WGL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

 ఏపీలోనూ భారీ వర్షాలు

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కృష్ణానది వరదలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వరద నీటిలో చిక్కుకున్న బాధితులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, అందరినీ ఆదుకుంటామని, అందరూ ధైర్యంగా ఉండాలని CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలన్నీ చేపడుతామని, తాను విజయవాడలోనే ఉంటానని చెప్పారు. అన్నట్లే ఆయన రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ పగలూ, రాత్రీ నిర్వీరామంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ,పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 41,927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించినట్లు అధికారులు తెలిపారు. 171 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సహాయక చర్యల్లో 36 NDRF, SDRF బృందాలు, 5 హెలికాప్టర్లు నిరంతర సేవలు అందిస్తున్నాయి. 188 బోట్లును,283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

 నేడు ఈ జిల్లాల్లో..

ఇదిలా ఉండగా అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం పలు జిల్లాలకు వర్షసూచనలు చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. SKLM, VZM, కోనసీమ, VZG, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, WG, ప్రకాశం, KNL, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, CTR, తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Share post:

లేటెస్ట్