ManaEnadu:దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (tirumala tirupati devasthanam) ఒకటి. నిత్యం ఎంతో మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala) కొండపైకి తరలివస్తారు. ముఖ్యంగా కాలినడకన అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్లి బాలాజీకి మొక్కులు చెల్లించుకుంటారు. చాలా మంది ప్రముఖులు కూడా తిరుమల మెట్లపై నడిచే వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటారు. కేవలం తిరుమల శ్రీవారే ఫేమస్ కాదు. ఆయన సన్నిధిలో దొరికే లడ్డూలు కూడా వరల్డ్ ఫేమస్.
అమృతం లాంటి ప్రసాదం..
చాలా మంది ఎవరైనా తిరుమలకు వెళ్తున్నామంటే దర్శనం బాగా జరిగిందా అని అడిగేకంటే ముందు లడ్డూలు (Tirumala Laddu) తీసుకొచ్చారా అని అడుగుతుంటారు. తిరుమలల లడ్డూలు చాలా చాలా ప్రత్యేకమైనవి. ఇక ఈ లడ్డూల రుచి ఎలా ఉంటుందంటే? వీటిని తిన్న వారు అమృతం అంటే కచ్చితంగా ఇలానే ఉంటుందని చెబుతారు. అయితే గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా తిరుమలలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేసిందట. మరి ఆ మార్పులేంటో చూద్దామా?
దళారుల అక్రమాలు..
తిరుమల శ్రీవారి (Tirumala Srivaru)ని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ టీటీడీ ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఎక్కువ లడ్డూలు కావాలంటే భక్తులు లడ్డూ కౌంటర్ల దగ్గర 4-6 లడ్డూలను(రూ. 50) కొనుగోలు చేయొచ్చు. కానీ, కొంతమంది దళారులు స్వామి వారి దర్శన టికెట్లు లేకుండా లెక్కకు మించి లడ్డూలు కొని బయట ఎక్కువ ధరకు విక్రయిస్తూ భక్తులను మోసగిస్తున్న విషయం ఇటీవలే టీటీడీ దృష్టికి వచ్చింది.
ఇక నుంచి రెండే లడ్డూలు..
దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దర్శనం టికెట్ లేకుండా తిరుమల ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని నిర్ణయించింది. టికెట్లు ఉన్న వారికి మాత్రం నాలుగు నుంచి ఆరు లడ్డూలు (Tirumala Laddu Prasadam) కొనుగోలు చేసే అవకాశం ఉంటుందట. టికెట్ లేనివారు ఆధార్ కార్డు చూపించి కేవలం రెండు లడ్డూలు మాత్రమే కొనుగోలు చేయొచ్చు.