ManaEnadu:ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటాను. అండగా నిలుస్తాను. పదవి నాకు అలంకారం కాదు.. మీరు నా చేతిలో పెట్టిన బాధ్యత. మీకోసం పని చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధం. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేను చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ‘గ్రామసభలు’ నిర్వహించారు. మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని, అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తామని అన్నారు.
మరోవైపు మైసూరువారిపల్లె సర్పంచ్ కారుమంచి సంయుక్తపై పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలంటేనే భయపడే సమయంలో ఆమె బరిలో నిలిచారని కొనియాడారు. ఎన్నికల సమయంలో రోడ్లపైకి రావాలంటేనే అందరూ భయపడే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి సంయుక్త విజయం సాధించారని ప్రశంసించారు. మిలిటరీలో పనిచేసిన భర్తను కోల్పోయి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావించడం నిజంగా తన గుండెను కదిలించిందని తెలిపారు. సంయుక్త పట్టుదల చేసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆమె గెలిచాక చాలా ఆనందంగా అనిపించిందని అన్నారు.
“అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటాం. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని నేను వదలుకోను. మనుషులను కలుపుకొనే వ్యక్తిని కానీ విడగొట్టేవాణ్ని కాదు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యం. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. 13 వేల 326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలం.” అని పవన్ కల్యాణ్ అన్నారు.